మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యజమాని సౌరవ్ చంద్రశేఖర్(Sourav chandra shekar) వివాహానికి హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలపై ఈడీ(Ed) నిఘా పెట్టింది. ఆ సెలబ్రిటీలందిరికీ నోటీసులు(summons) పంపేందుకు ఈడీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు పంపేందుకు ఈడీ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
సౌరవ్ చంద్రశేఖర్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ లో జరిగింది. ఈ వివాహానికి మొత్తం 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. సౌరవ్ తన వివాహానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. అందులో అత్యధిక భాగం బాలీవుడ్ సెలబ్రిటీల కార్యక్రమానికి చెల్లించారు. సౌరవ్ చంద్ర శేఖర్ పై రూ. 5000 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు వున్నాయి.
మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు పంపాలని ఆలోచిస్తోంది. ఆ సెలబ్రిటీల్లో టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్ తో పాటు ఇతర సెలబ్రిటీలు వున్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు గతేడాది సెప్టెంబర్ 18న సౌరవ్ మరో పార్టీ ఇచ్చారు.
సెవెన్ స్టార్ హోటల్ లో ఏర్పాటు చేసిన ఆ పార్టీకి హాజరు కావాలని బాలీవుడ్ సెలబ్రిటీలకు సౌరవ్ రూ. 40 కోట్లు చెల్లించినట్టు ఈడీ అభియోగాలు చేస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన వివాహానికి హాజరయ్యేందుకు సౌరత్ కుటుంబ సభ్యుల కోసం, బాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం ప్రైవేట్ జెట్ లను అద్దెకు తీసుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది.