జమ్మూ కశ్మీర్(Jammu kasmir)లో వరుసగా నాల్గవ రోజు ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా నియంత్రణ రేఖ(Line of controle)కు సమీపంలో బారాముల్లా(Baramulla) జిల్లా ఉరి సెక్టార్లో ఎన్ కౌంటర్(Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హత్లాంగా ప్రాంతంలో ఉగ్రకదలికలపై పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో పోలీసులు, భ ద్రతా దళాలు ఆపరేషన్ మొదలు పెట్టాయి.
కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా దళాల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదులు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారనే వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
జమ్ములోని కోకేరంగ్ లోని గడుల్ అటవీ ప్రాతంలో లష్కరే ఉగ్రవాదులు ఉన్నట్టు నాలుగు రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. అదే రోజు రాత్రి ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అధికారులు మరణించారు.
ఈ క్రమంలో నాలుగు రోజులుగా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వాళ్ల దగ్గర నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను బారాముల్లాలకు చెందిన జాయిద్ హసన్ మల్లా, మీర్ సాహిబ్ లుగా పోలీసులు గుర్తించారు.