మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉమారియా జిల్లాలో కారు (Car) ఒకటి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మజగావా గ్రామంలోని జాతీయ రహదారి 43పై ఉదయం 3 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు ఉమారియా నుంచి షహడోల్ కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఉమారియా నుంచి వేగంగా వస్తున్న కారు మజగావా గ్రామానికి చేరుకోగానే చెట్టును ఢీ కొట్టిందని ఏఎస్ఐ శైలేంద్ర చతుర్వేది తెలిపారు. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించినట్టు పేర్కొన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయన్నారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. మృతులంతా 30 నుంచి 35 మధ్య వయస్సు వారేనన్నారు.
మరోవైపు ఖర్గోనే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాసర్ వాడ్ ప్రాంతంలో ఆగి వున్న ట్రక్కును బీజేపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 39 మంది బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. భోపాల్ లో జరుగుతున్న ‘కార్యకర్త మహకుంభ’ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కార్యకర్తలంతా రూప్ ఘర్, కాప్రాజ్ మలి, రాయ్ సాగర్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జన్ ఆశీర్వాద్ యాత్ర అధికారిక ముగింపు, జన సంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా కార్యకర్త మహాకుంభ్ నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పారు.