బిహార్ (Bihar) లో రైలు ప్రమాదం (Train Accident) చోటు చేసుకుంది. బుక్సార్ (Buxar) జిల్లాలో రఘునాథ్ పూర్ స్టేషన్ సమీపంలో నార్త్- ఈస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అసోంలోని కామాఖ్య జంక్షన్ వెళ్తున్న సమయంలో రైలు ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.
రఘునాథ్ పూర్ సమీపానికి రైలు చేరుకోగానే ఆరు కోచ్ లు పట్టాలు తప్పాయి. అందులో రెండు ఏసీ కోచ్‌లు బోల్తాపడగా, మరో నాలుగు కోచ్‌లు పక్క ట్రాక్ పైకి దూసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రంగా గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్ కు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందగానే అధికారులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. ప్రమాద నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే 21 రైళ్లను దారి మళ్లించినట్టు చెప్పారు. ఈ ఘటనపై బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. సహాయక చర్యలు పూర్తయినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.