కర్ణాటక (Karnataka) లో బంద్ కు ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి బంద్ మొదలయింది. బంద్ నేపథ్యంలో మొత్తం 44 విమానాల (Flights) ను అధికారులు (Abondened) రద్దు చేశారు. నిర్వాహణ పరమైన కారణాల నేపథ్యంలో విమానాలను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రయాణికులకు కూడా తెలియజేశామన్నారు.
బంద్ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానాలను రద్దు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు కొందరు నిరసనకారులు కర్ణాటక జెండాను పట్టుకుని విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంద్ నేపథ్యంలో సాధారణ జనజీవనం స్థంబించి పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, సినిమా హాల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ మూత పడ్డాయి. కన్నడ అనుకూల సంస్థలు జాతీయ రహదారులపై ధర్నాకు దిగాయి. టోల్ గేట్స్ వద్ద నిరసనలు తెలిపాయి. బంద్ నేపథ్యంలో బెంగళూరు, మాండ్య జిల్లాల అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా మైసూర్, కొడగు, మాండ్య, చామరాజ నగర్, రామనగర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్రోతో పాటు ఆర్టీసీ బస్సులను నడపుతున్నారు. నిరసనకారులు బెంగళూరులో టౌన్ హాల్ నుంచి ఫ్రీడమ్ పార్కు వరకు నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు.
తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అటు తమిళనాడులోని కృష్ణగిరి, సేలం, ధర్మపురి, ఈరోడ్, నీలగిరి ప్రాంతాల్లోనూ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. బంద్ నేపథ్యంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రజలు ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.