హర్యానాలోని నూహ్ లో జరిగిన హింసలో మరణించినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. గత నెల 31 న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 116 మందిని అరెస్టు చేశారు. ఈ హింసాత్మక సంఘటనను సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు.. బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. . ఊరేగింపులు జరిగినప్పుడు ఎవరూ ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా చూడాలని కోరింది. మతపరమైన ఘర్షణలను అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్.వి. భట్టీలతో కూడిన బెంచ్.. ఈ మేరకు ఉత్తర్వులిస్తూ.. కీలక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను నియమించాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. నూహ్ లో జరిగిన ఘటనపై షాహీన్ అబ్దుల్లా అనే జర్నలిస్టు తరఫున సీనియర్ లాయర్ సి.యు. సింగ్ కోర్టులో వాదించారు. విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు నూహ్ తో బాటు నేషనల్ కేపిటల్ రీజన్ లోను 23 ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాయని ఆయన పేర్కొన్నారు.
నూహ్ లో గత నెల 31 న విశ్వ హిందూ పరిషద్ నిర్వహించిన ప్రోసెషన్ సందర్భంగా అల్లర్లు జరిగాయి. ఈ ఊరేగింపును అడ్డుకునేందుకు ఓ గుంపు యత్నించిన సందర్భంలో ఇద్దరు హోమ్ గార్డులు కూడా మృతి చెందారు. ఇక ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీ,నోయిడా, గుర్ గావ్ లలోని వివిధ చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.
నూహ్ లో జరిగిన ఘర్షణలకు కారణమైనవారిని వదిలే ప్రసక్తి లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరించారు. ప్రజల భద్రతే ముఖ్యమని చెప్పిన ఆయన.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. రాష్టంలో 20 పారామిలిటరీ బలగాలు, 30 రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించినట్టు ఆయన వెల్లడించారు. హర్యానాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు నగరంలోని సమస్యాత్మక ప్రదేశాల్లో అదనపు భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు తెలిపారు. .