ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పితోర్ ఘర్ (Pithoragarh) జిల్లాలో కారు ఒకటి కాళీ నదిలో పడి పోయింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆది కైలాశ్ దర్శనం చేసుకుని వస్తుండగా లఖన్ పూర్ సమీపంలో దార్చులా-లీపు లేఖ్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగినట్టు పితోర్ గఢ్ ఎస్పీ లోకేశ్వర్ సింగ్ తెలిపారు.
దర్శనం అనంతరం వాహనం వేగంగా వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో లఖన్ పూర్ సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి నదిలో ఫడిపోయిందన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. మృతుల్లో ఇద్దరిని బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు.
మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారని, ఇంకో ఇద్దరు ఉత్తరాఖండ్ కు చెందిన వారిగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చీకటిగా వుండటం, భౌగోలిక పరిస్థితుల వల్ల మృత దేహాల వెలికి తీత ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది ఇలా వుంటే పది రోజుల క్రితం డెహ్రూడన్ జిల్లా చక్రాట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి వస్తున్న జీపు ఒకటి చక్రాట వద్ద అదుపు తప్పి వంతెన పై నుంచి పడి పోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.