ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల (2000 Notes Return) ను సెప్టెంబరు 30 తర్వాత ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ (RBI) ప్రకటించింది. రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్చుకునేందుకు (Exchange) ఆర్బీఐ అవకాశం కల్పించింది. దీంతో ఆగష్టు 31 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లు 93 శాతం బ్యాంకు (Banks)లకు చేరాయని ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటీ వరకు బ్యాంకులకు చేరిన 93 శాతం నోట్ల విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు చెలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ. 3.56 కోట్లు. వీటిలో ఆగస్టు 31 నాటికే 3.32 కోట్లు విలువ చేసే నోట్లు వెనక్కి వచ్చేశాయి. బ్యాంకులకు తిరగొచ్చిన రూ. 2000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, 13 శాతం ఎక్స్ఛేంజీ రూపంలో వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.
ఇంకా 0.24 లక్షల కోట్లు విలువ చేసే రూ. 2000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని, సెప్టెంబర్ 30 నాటికి అవి కూడా తిరిగొస్తాయని ఆర్పీఐ తెలిపింది. రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు లేదా ఎక్స్ఛేంజీ చేసుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. డెడ్ లైన్ కు ఇంకా 28 రోజులు మిగిలి ఉన్నందున అన్ని నోట్లు వెనక్కి వచ్చే అవకాశం ఉంది.
రూ. 2000 నోట్లు కలిగిన ప్రజలు ఏ బ్యాంకు శాఖకైనా వెళ్లి, లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. క్లీన్ నోట్ పాలసీ ప్రకారమే రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
రూ. 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో బ్యాంకులలో డిపాజిట్లు భారీగా పెరిగాయి. నోట్లన్నీ వెనక్కి రావడంతో దేశంలోని అన్ని బ్యాంకుల్లో డబ్బు భారీగా జమ అయింది. దీంతో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. గతంలో బ్యాంకుల వద్ద నగదు లేక డిపాజిట్ల కోసం కస్టమర్లకు ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేశాయి. కానీ ఇప్పుడు మళ్లీ తగ్గిస్తున్నాయి.