దేశంలో యాపిల్ ఫోన్ల (Apple Phones) హ్యాకింగ్ (Hacking) కలకలం రేపుతోంది. తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విపక్షాల ఎంపీలు ఆరోపిస్తున్నారు. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ మీ ఫోన్ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యాపిల్ సంస్థ తమను హెచ్చరించిందని అల్టర్ తాలూకు మెసేజ్ లను షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సుమారు మూడు వేల మందికి ఇలాంటి సందేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, సుప్రీయా శ్రీనాథ్, శశిథరూర్ తో పాటు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, మహువా మోయిత్రాలతో పాటు పలువురు ప్రముఖులను అలర్ట్ మెసేజ్ వచ్చింది. నిత్యం ప్రజల పక్షాన వార్తలు రాసే ‘రాష్ట్ర’ మేనేజ్ మెంట్ కు సైతం ఇలాంటి హెచ్చరికలు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ పై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. మోడీ సర్కార్… ఇదంతా ఎందుకు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. మరోవైపు తన ఫోన్, ఈ మెయిల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని యాపిల్ చేసిన హెచ్చరికలను ఎంపీ మహువా మోయిత్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ స్క్రీన్ షాట్స్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఖాతాను ట్యాగ్ చేశారు. మరోవైపు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్య ప్రయోజనాలు.. దేశ ప్రజలపై దాడిగా హ్యకింగ్ ను ఆయన విమర్శించారు. ఇది ప్రతి భారతీయుడు ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. ఎందుకంటే ఈ రోజు తనకు జరిగిందని, రేపు అది మీకు కూడా జరగవచ్చన్నారు.