తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామంటూ బీజేపీ (BJP) చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. బీజేపీ రెండు శాతం ఓట్ల కూడా సంపాదించలేదని, అలాంటి పార్టీ ఇలాంటి హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అమెరికాకు వెళ్లి బీసీని ప్రెసిడెంట్ చేస్తామని హామీ ఇచ్చినట్టుగా బీజేపీ ప్రకటన ఉందని సెటైర్లు వేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. బీజేపీ ఇచ్చే డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ ఒడించే ఉద్దేశంతో మజ్లిస్ పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని ఆరోపించారు. మొదట ఇక్కడ కారు పార్టీని ఓడించి ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడిద్దామన్నారు.
తెలంగాణలో బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యేది లేదన్నారు. తెలంగాణ ప్రజల వద్ద ఇలాంటి ఉల్టాపల్టా మాటలు వద్దని బీజేపీకి సూచించారు. పలు రాష్ట్రాల్లో తామ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి పంక్చర్ అయిన తమ వాహనాన్ని బీజేపీ సరి చేసుకోవాలని సెటైర్లు వేశారు.
అంతకు ముందు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. జిల్లెల్ల గ్రామంలో అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుమ్మరి చంద్రయ్య (35) నివాసానికి రాహుల్ గాంధీ వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు.