ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి(Daggupati Purandeswari)పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)కి టీడీపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో టీటీడీపీ(TTDP)కి చెందిన ఓ బీసీ నేత రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్కు మద్దతు పలుకుతోన్న టీడీపీకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలని ‘x’(ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు.
‘అమ్మా పురంధేశ్వరి గారూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో మద్దతు చెబుతున్నారంటే మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా’ అని పేర్కొన్నారు. పురంధేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవన్నారు.
మొదట టీడీపీ, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్.. మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగు సార్లు మారిన చరిత్ర ఆమెదని ఎద్దేవా చేశారు. ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? అని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. ఎంపీ విజయసారెడ్డిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీజేఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో విజయసాయిరెడ్డి పదేళ్లకు పైగా బెయిల్ ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఎంపీ విజయసాయి రెడ్డిపై విచారణ జరపాలని లేఖలో పురందేశ్వరి కోరారు.