రాస్ బిహారీ బోస్.. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను స్థాపించి జపాన్ సహాయంతో భారత్ కు స్వాతంత్య్రం అందించాలని ప్రయత్నించిన గొప్ప వీరుడు. బ్రిటీష్ వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్ -2పై బాంబు విసిరిన పోరాట యోధుడు. జతిన్ ముఖర్జీతో కలిసి గదర్ పార్టీ తరఫున బ్రిటీష్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్త తిరుగుబాటుకు ప్రణాళికలు రచించాడు.
1886 మే 25న పశ్చిమ బెంగాల్ లోని సిబైదాహ గ్రామంలో జన్మించారు రాస్ బిహారీ బోస్. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటాన్ని చిన్నతనంలోనే చూశాడు. ప్రజల ఇబ్బందులు చూసి బ్రిటీష్ పాలకులపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత చారు చంద్రరాయ్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందాడు.
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం విప్లవ కార్యకలాపాల పట్ల ఆసక్తి కనబరిచాడు. ఆ తర్వాత అలీపూర్ కుట్ర కేసులో పాల్గొని విచారణను ఎదుర్కొన్నాడు. అనంతరం యుగాంతర్ సంస్థకు చెందిన అమరేంద్ర ఛటర్జీ, ఇతరులతో కలిసి పూర్తి స్థాయిలో విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 1912లో భారత రాజధానిని కోల్ కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ సమయంలో ఏనుగుపై ఊరేగుతున్న అప్పటి వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-2పై సచిన్ సన్యాల్ తో కలిసి బాంబు విసిరాడు.
ఈ ఘటనలో హార్డింజ్-2కు గాయాలయ్యాయి. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు జపాన్ వెళ్లి అక్కడ ఓ బేకరీ నిర్వహకుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 1942 మార్చిలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా జపాన్ మద్దతు పొంది భారత్ కు స్వాతంత్ర్యం అందించాలని ప్రయత్నించాడు. మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని భారత జాతీయ సైన్యం కూడా ఆ తర్వాత ఈ లీగ్ ఆధ్వర్యంలో పని చేశారు. తర్వాత లీగ్ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్ కు అప్పగించారు. చివరకు ట్యూబర్ క్లోసిస్ బారిన పడి రాస్ బిహారీ బోస్ కన్నుమూశారు.