హైదరబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో (Road Show)లో ప్రధాని మోడీ (PM Modi) పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మొదలైన రోడ్ షో కాచీగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు సాగింది. సుమారు మూడు కిలో మీటర్ల పాటు రోడ్ షో జరిగింది. ప్రధాన మోడీ రోడ్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచీగూడ వరకు భారీగా కార్యకర్తలు, ప్రజలు, మోడీ అభిమానులతో రోడ్లన్నీ నిండిపోయాయి.
దారి పొడువున బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు కదిలారు. ఈ సదర్భంగా బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీపై పూల వర్షం కురిపించారు. కాచిగూడకు చేరుకున్న మోడీ అక్కడ వీరసావర్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోని కోటి దీపారాధన మహోత్సవానికి ప్రధాని మోడీ హాజరయ్యారు.
అటు కార్తిక దీపోత్సవం కావడం, ఇటు ప్రధాని మోడీ రావడంతో ఎన్టీఆర్ గ్రౌండ్స్ కు భారీగా జనం వచ్చారు. ఇది ఇలా వుంటే ప్రధాని మోడీ రోడ్ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ రోడ్ షో జరిగే మార్గంతో పాటు, ఎన్టీఆర్ గ్రౌండ్స్ వైపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపి వేశారు. దాంతో పాటు పలు మెట్రో స్టేషన్లను కూడా పోలీసులు మూసివేశారు. అంతకు ముందు ప్రధాని మోడీ కరీంనగర్, మహబూబా బాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రోడ్ షోతో తెలంగాణలో ఆయన పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.