Telugu News » Budget : మోడీ 2.0 సర్కార్ చివరి బడ్జెట్… కేటాయింపులివే…!

Budget : మోడీ 2.0 సర్కార్ చివరి బడ్జెట్… కేటాయింపులివే…!

రూ. 47.65 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ రూపొందించారు. బడ్జెట్‌లో భాగంగా పలు శాఖలకు నిధులు కేటాయించారు.

by Ramu
Modi

– నిర్మలమ్మ పద్దు.. రూ.47.65 లక్షల కోట్లు
– పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లు
– ఆదాయంపై పన్ను మినహాయింపు
– నానో డీఏపీ కింద ఎరువుల పంపిణీ
– సోలార్ పాలసీ ద్వారా 300 యూనిట్ల ఫ్రీ కరెంట్
– ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం
– పదేళ్లలో వికసిత్ భారత్
– 2047 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యం
– రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు
– వందే భారత్ తరహాలో 40వేల బోగీల అప్ గ్రేడ్
– మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

మోడీ 2.0 సర్కార్‌లో చివరి బడ్జెట్‌ (Budget)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) గురువారం ప్రవేశపెట్టారు. రూ. 47.65 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ రూపొందించారు. బడ్జెట్‌లో భాగంగా పలు శాఖలకు నిధులు కేటాయించారు. ఇందులో అత్యధికంగా రక్షణ శాఖకు కేటాయింపులు చేశారు.

rs 47 lakh crore budget allocations are follows

రక్షణశాఖకు రూ 6.2 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. ఆ తర్వాత రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది. హోం శాఖకు రూ. 2.03 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 1.77లక్షల కోట్లు కేటాయింపులు జరిగాయి.

ఇక ఉపరితల రవాణా, జాతీయ రహదారుల కోసం రూ.2.78 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.2.13 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువుల కోసం రూ. 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేల కోట్లు, ఆయుష్మాన్‌ భారత్ పథకానికి రూ.7,500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200 కోట్లు, సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకోవ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు, సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8,500 కోట్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.600 కోట్లు కేటాంయిచామని తెలిపారు. మొత్తం బడ్జెట్‌ పరిమాణం రూ. 47.66 లక్షల కోట్లు ఉండగా, వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు అందుతుందని వివరించారు.

బడ్జెట్ లో తెలంగాణ

తెలంగాణకు రూ.5,071 కోట్ల కేటాయింపు
తెలంగాణలో వంద శాతం విద్యుదీకరణ పూర్తి
రాష్ట్రంలో రైల్వేపై పెరిగిన పెట్టుబడులు
40 శాతం అమృత్ స్టేషన్లు
ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం

బడ్జెట్ లో ఆంధ్రా

ఏపీకి రూ.9,138 కోట్ల కేటాయింపు
పది శాతం రెట్టింపు
98 శాతం రైల్వే ట్రాక్స్‌ కి విద్యుదీకరణ పూర్తి
72 అమృత్ స్టేషన్ల అభివృద్ధి
240 కిలోమీటర్ల ట్రాక్ పనులు
విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమి
రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన వెంటనే పనులు
జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్‌ సిద్ధం

You may also like

Leave a Comment