జ్ఞానవాపి కేసు (Gyanvapi Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని అడ్వకేట్ జనరల్ ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఆదేశించారు.
అంతకు ముందు మసీదులోని దక్షిణ సెల్లార్‌లో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారణాసి కోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో మసీదు కమిటీ సవాల్ చేసింది. దీంతో అలహాబాద్ హైకోర్టు ఆశ్రయించాలని మసీదు కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మసీదు కమిటీ తరఫున సీనియర్ ఎస్ఎఫ్ఏ నఖ్వీ, పునీత్ గుప్తాలు వాదనలు వినిపించారు. మసీదులో నేలమాళిగలో వ్యాస్ కా టేఖనా నాలుగు సెల్లార్లలో ఒకదానిని హిందూ పక్షం డిమాండ్ చేస్తోందని అన్నారు. దానికి వారణాసి కోర్టు ఆమోదం కూడా తెలిపిందన్నారు.
హిందువుల పక్షాన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదించారు. మసీదు కమిటీ పిటిషన్‌ను ఆయన వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టున ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు వారణాసి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. దీంతో ముస్లిం పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది.