పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే(Peddapally Ex MLA) బిరుదు రాజమల్లు (Birudu Rajamallu) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఇటీవలే కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
రాజమల్లు 1930లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీలో మొదలుపెట్టారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
తర్వాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో అదే అభ్యర్థిని 39 వేల 677 ఓట్ల మెజార్టీతో ఓడించి తొలి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో బీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజమల్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.