కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా కుక్క పిల్లకు రాహుల్ గాంధీ బిస్కెట్ తినిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను భారత్ జోడో న్యాయ్ యాత్ర షేర్ చేయగా దానిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాహుల్ గాంధీపై నిప్పులు చెరుగుతున్నారు.
జార్ఖండ్లో రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర సందర్బంగా ఈ వీడియోను తీశారు. యాత్ర సమయంలో రాహుల్ గాంధీ దగ్గర ఓ కుక్క పిల్ల కనిపించింది. ఆ కుక్క పిల్లకు బిస్కెట్ ప్యాకెట్ ఉందా అని తన సహాయకులను రాహుల్ గాంధీ అడిగారు. దీంతో ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వగా అందులో ఓ బిస్కెట్ తీసుకుని కుక్కు పిల్లకు తినిపించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేశారు.
కానీ ఆ కుక్క పిల్ల తినలేదు. అదే సమయంలో కొంత మంది కార్యకర్తలు రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో ఆ బిస్కెట్ ను అతనికి ఇచ్చినట్టుగా బీజేపీ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో వ్యక్తికి బిస్కెట్ ఇచ్చే దృశ్యాలు కనిపించడం లేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో రాహుల్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు బిస్కెట్లు తినిపించలేకపోయారని అన్నారు. తాను బిస్కెట్ తినేందుకు నిరాకరించానని, అందుకే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశానని చెప్పారు. తాను అస్సామీ, భారతీయుడినైనందుకు గర్వపడుతున్నట్టు వెల్లడించారు.