మేడిగడ్డ లాగే మరో బ్యారేజీ ప్రమాదంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam kuamr Reddy) సంచలన ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీ(Assembly)లో సాగునీటి శాఖపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కీలక విషయాలను వెల్లడించారు.
శుక్రవారం నుంచి అన్నారం బ్యారేజీలో నీరు లీక్ అవుతోందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అన్నారం బ్యారేజీ కొంతమేర నీటిని ఖాళీ చేయాలని ఎన్డీఎస్ఏ టీమ్ సూచించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ టీమ్‌ను పిలిపించి డ్యామ్‌ను పరిశీలించాలని కోరిన సంగతి తెలిసిందే. డ్యామ్‌ను పర్యటించిన ఎన్డీఎస్ఏ బృందం లీకులు నిజమేనని తేల్చిందని మంత్రి వెల్లడించారు.
కట్టిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి తమపై ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసిందని మంత్రి తెలిపారు. దురదృష్టవశాత్తూ మేడిగడ్డ కుంగిపోయిందని, డిజైన్, నిర్మాణ లోపాలు, ఓఅండ్ఎం పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయిందని వెల్లడించారు.
అదేవిధంగా వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీని.. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతి కారణంగా మేడిగడ్డి ఈ స్థితిలో ఉందన్నారు. రూ.1800 కోట్లతో టెండర్లు పిలిచి అంచనా వ్యయం రూ.4,500కోట్లకు పెంచారని తెలిపారు. దీనిబట్టి ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోందన్నారు. దేశంలో ఈ తరహా అవినీతి జరగలేదన్నారు. ఇకపై జరగనివ్వమన్నారు.