ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 (IPL-2024) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శుక్రవారం (మార్చి 22) చెన్నె సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సాధన చేస్తున్నాయి.
ఈ మ్యాచ్ కోసం మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టు చెన్నెకి చేరుకుని ప్రాక్టీస్ చేస్తోంది. ప్రాక్టీస్ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(Glenn Maxwell) ఇమిటేట్ చేశాడు. విరాట్ నెట్లో బ్యాటింగ్ చేస్తుండగా.. మాక్స్వెల్ వెనుక నిలబడి కోహ్లి షాట్లను అనుకరించాడు. కోహ్లి మైదానంలో ఎలా నడుస్తాడో మాక్స్వెల్ చూపించాడు.
అదేవిధంగా టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సైతం కోహ్లీని ఇమిటేట్ చేశాడు. మైదానంలో బౌలర్ బంతిని ఇచ్చే ముందు విరాట్ ఎలా తన ప్యాంటు రుద్దుతాడో అచ్చం అలానే చేశాడు. విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్‌లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. విరాట్ కూడా గతంలో చాలామందిని ఇమిటేట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్, ఇషాన్ కిషన్ లాంటి చాలా మందిని అనుకరించాడు. కోహ్లీ భార్య అనుష్క రెండో బిడ్డకు జన్మిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ క్రికెట్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకున్నారు. తాజాగా ఐపీఎల్ 2024 కోసం లండన్ నుంచి భారత్ వచ్చాడు.