వైద్యుడి నిర్లక్ష్యం వల్ల 10 నెలల బాలుడు ప్రాణం కోల్పోయిన సంఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి (Dharpalli) మండలానికి చెందిన చిన్నారి గత నెలలో అస్వస్థతకు గురి కావడంతో.. ఖలీల్వాడిలో ఉన్న చిల్డ్రన్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కాగా ఐదు రోజులు వైద్యం అనంతరం ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడింది.. ఇక ఆ బాలుడిని డిశ్చార్జ్ చేయడమే ఆలస్యం..
ఈ క్రమంలో డిశ్చార్జి చేసే సమయంలో ఓ ఇంజక్షన్ (Injection)ఇచ్చారు. దీంతో అకస్మాత్తుగా ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన ఆస్పత్రి వైద్యుడు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఆ బాలుడు మరణించాడు.
అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న పిల్ల వాడు.. అకస్మాత్తుగా మృతి చెందటంపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు.. ఇంజక్షన్ గురించి ఆరా తీయగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ తో పాటు ఒకటో టౌన్ పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయాన్ని గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం తమకు తప్పుడు బిల్లులు ఇచ్చిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
ఈ సంఘటనపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రాణం పోయినా అధికారులు మేల్కొనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..