గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టు సాధించాలని భావించిన భారతీయ జనతా పార్టీ(BJP)కి పలువురు నేతలు షాకిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం పార్టీ గుర్తుపై పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్(Koona Srisailam Goud) బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద చేతిలో పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు.అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు కాంగ్రెస్ నేతలు గాలెం వేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే కూన శ్రీశైలం గౌడ్‌తో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు భేటీ అయ్యి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఎంపీ ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం, శ్రేణులు ప్రచారంలో బిజీబిజీగా మారిపోగా కూన శ్రీశైలం మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అయితే, కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మైనంపల్లి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు గురువారం కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్లి పార్టీ చేరాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే.