రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేరని కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal) సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ముఖ్య అతిథులుగా పీయూష్ గోయల్‌తో పాటు ఎంపీ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్(K.Laxman) హాజరయ్యారు. అదేవిధంగా సంగారెడ్డిలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ కార్యక్రమంలోనూ ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ రూ.100 ఇస్తే దళారులు రూ.85 తిని రూ.15 మాత్రమే పేదలకు అందేదని తెలిపారు. కరప్షన్, కుటుంబ పాలనకి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు.
తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ సర్కార్ పని అయిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.