పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ(BJP) పార్టీ పొలిటికల్ క్యాంపెనింగ్‌ను స్వీడ్ అప్ చేసింది. ఈ క్రమంలోనే నిజామాబాద్(Nizamabad) ఎంపీ ధర్మపురి(Mp arvind) అర్వింద్ శుక్రవారం ఉదయం పాలిటెక్నిక్ మైదానంలో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో యువత తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
అప్పుడే దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దిన వారు అవుతారని తెలిపారు. దేశంలో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా యువతపైనే ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోంచుకోవాలని కోరారు.
గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను అమృత్ పథకం కింద మంజూరు చేస్తే అప్పుడున్న బీఆర్ఎస్ వాటిని మిషన్ భగీరథ కోసం వాడుకుందని ఆరోపించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని వివరించారు.
ఇక కాంగ్రెస్ , బీఆర్ఎస్ ప్రభుత్వాలు కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి తనను గెలిపిస్తే నిజామాబాద్ ను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఇందూరు ప్రజల కోరిక మేరకు నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తానని ఎంపీ అర్వింద్ ప్రజలకు హమీనిచ్చారు.ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.