ప్రధాని మోడీ (PM Modi) ఎస్సీ వర్గీకరణపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ (Telangana)లో పర్యటిస్తోన్న ఆయన.. జహీరాబాద్ (Zaheerabad) లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మాదిగలకు మాత్రం తప్పకుండా న్యాయం చేస్తామని మాటిచ్చిన ప్రధాని.. కాంగ్రెస్‌కి ఉమ్మడి ఏపీలో రికార్డ్ స్థాయిలో ఎంపీ స్థానాలొచ్చాయని.. అయిన కూడా దళితులు, ఓబీసీలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.. అదేవిధంగా లింగాయత్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని.. కానీ ముస్లిం రిజర్వేషన్లకు మాత్రం ఆ పార్టీ అనుకూలమని ధ్వజమెత్తారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ బంజారా రిజర్వేషన్ల విషయంలో మోసం చేశాయని ఆరోపించారు.
బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్న కాంగ్రెస్ (Congress).. ప్రజలను పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.. ఈ దేశంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్న ప్రధాని.. రాహుల్ గాంధీ తాత, నానమ్మ పలు మార్లు భారత రాజ్యాంగాన్ని మార్చి అవమానించారని నిప్పులు చెరిగారు.
తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ రాజ్యాంగాన్ని వాడుకొంటుదని విమర్శించిన మోడీ.. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హయాంలో దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని అంబేద్కర్ రాజ్యాంగంలో తెలిపారు.. కానీ కాంగ్రెస్ మాత్రం దొంగ దారిలో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.