తాగుడుకు బానిసై సంపాదించిన డబ్బులు సరిపోక అందినకాడికి అప్పులు చేసే మందు బాబులు ఉన్నారు. మందు షాపులు బందైతే చాలు తప్ప తమ కుటుంబాలు బాగుపడవని ఓ స్థాయి నమ్మకానికి వచ్చేశారు మందుబాధిత కుటుంబాల మహిళలూ ఉన్నారు.
ధర్నాలు చేసైనా మద్యం షాపులు తెరవకుండా చెయ్యాలనే ఆవేశం ఆ ఆడవాళ్లది. కానీ ఒక ఊరిలో వీటికి భిన్నంగా.. మద్యం షాపులు కావాలంటూ పురుషులతో పాటూ మహిళా మణులు కూడా ధర్నా చేసిన ఘటన సంచలనంగా మారింది.
తమ గ్రామంలో కూడా మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటూ గ్రామస్థులు ఏకంగా తీర్మానమే చేశారు. ఈ వింత డిమాండ్ మరెవరిదో కాదు..వర్షాలతో అతలాకుతలం అయిన ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల ప్రజలది..!
మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయా గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సభలో.. ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటు అనే అంశానికి ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు.
అయితే హైకోర్టు స్టే విధించడంతో గత ఐదేళ్లుగా మండలంలో మద్యం దుకాణాలు లేవు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా విన్నవించనున్నారు. ఇక.. తెలంగాణలో మద్యంపై ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది.
మద్యం ప్రియులను నిరాశపరచకుండా ప్రభుత్వం కూడా వారికి తగ్గట్టుగా కీలక నిర్ణయాలు తీసుకుని ఖజానా నింపుకుంటోంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు.
గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇప్పటి వరకు మద్య నిషేధం.. మద్యం షాపుల ఎత్తివేతపై తీర్మానాలు చేస్తే.. ఇప్పుడు వైన్ షాపు ఏర్పాటుకు తీర్మానాలు చేయడం ఆసక్తికరంగా మారింది.