దేశవ్యాప్తంగా మహిళా బిల్లు (women’s bill) పై చర్చ జరుగుతోంది. ఈసారైనా ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతుందా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలు కేటాయించే సీట్లపైనా తెగ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మంత్రి కేటీఆర్ (KTR) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి, మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచానికే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ చేరుకుందని.. పెట్టుబడులకు నగరం అనువైన ప్రాంతమన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అండగా ఉంటామన్న ఆయన.. లైఫ్ సైన్సెస్ హబ్ గా మారుతోందని తెలిపారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ చాలా అందమైన నగరమని.. ఇక్కడ టాలెంట్ కు కొరత లేదన్నారు కేటీఆర్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని తెలిపారు. మన జీవితాలు చాలా చిన్నవని.. తన పాత్ర తాను పోషించానని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడారు. ఈ బిల్లును తాము స్వాగతిస్తున్నాని చెప్పారు. ఒక వేళ మహిళా రిజర్వేషన్ లో తన సీటు పోయినా బాధపడబోనని స్పష్టం చేశారు. ఎక్కువ మంది మహిళా లీడర్లు రావాలన్నారు కేటీఆర్.