శ్రీదేవి (Sridevi) శరీరాకృతిని, అందాన్ని కాపాడుకునేందుకు చాలా కఠినమైన ఆహార నియమాలు పాటించేవారని ఆమె భర్త బోనీకపూర్ (Boney Kapoor) అన్నారు. అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీదేవి దుబాయ్ (Dubai) లోని ఒక హోటల్ లో అనుమానస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి మరణంపై బోనీకపూర్ స్పందించారు.
2018లో శ్రీదేవి దుబాయ్ లో ఓ పెళ్ళికి వెళ్లగా అక్కడ హోటల్ లో బాత్ టబ్ లో పడి మరణించారు. అయితే శ్రీదేవి ఎక్కడో విదేశాల్లో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చనిపోవడం, ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరణించడంతో బోనీకపూర్ పై అనుమానాలొచ్చాయి. దీంతో దుబాయ్ పోలీసులు అప్పుడు బోనికపూర్ ని అదుపులోకి తీసుకొని విచారించారు కూడా.
శ్రీదేవి మరణంపై, దుబాయ్ లో జరిగిన పరిస్థితులపై బోనీకపూర్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి శ్రీదేవి మరణం గురించి, ఆమె మరణం తర్వాత బోనీకపూర్ దుబాయ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు. బోనీకపూర్ మాట్లాడుతూ…శ్రీదేవి చనిపోయాక అందరూ నన్ను అనుమానించారు. ఇండియన్ ఎంబసీ నుంచి దుబాయ్ పోలీసుల మీద ఒత్తిడి రావడంతో నన్ను అదుపులోకి తీసుకొని దాదాపు 48 గంటల పాటు విచారించారు. అన్ని రకాల టెస్టులు చేశారు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేసారు. నేను ఏ తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాతే నన్ను విడిచిపెట్టారు అని అన్నారు.
తన భార్య చనిపోవడానికి కారణం ఆమె ఆహార నియమాలేనని భావిస్తున్నట్లు బోనీకపూర్ చెప్పారు. ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీకపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు. ఈ క్రమంలోనే కళ్లు తిరిగి బాత్ టబ్ లో పడిపోయి ఉంటుందని, నీళ్లలో పడడంతో ఊపిరి ఆడక చనిపోయి ఉంటుందని బోనీకపూర్ చెప్పారు.