– కబ్జాకోరుల వెన్నులో వణుకు పుట్టించిన ‘రాష్ట్ర’
– అధికారులతో కలిసి వేసిన ప్లాన్ మటాష్
– ఖమ్మం శివారులో భూవివాదంపై..
– ‘కబ్జాలకు అండగా కమీషనర్’ పేరుతో కథనం
– ‘రాష్ట్ర’ కథనంతో కదిలిన పోలీసులు
– 9 మందిపై కేసు నమోదు
– ఆగమేఘాల మీద అక్రమ షెడ్ తొలిగింపు
కబ్జాకోరుల ప్లాన్ బెడిసికొట్టింది. అధికారులతో కుమ్మక్కయి ప్రైవేట్ భూమిని అప్పనంగా కొట్టేయాలని చూసిన వైనాన్ని ‘రాష్ట్ర’ (Raashtra) బయటపెట్టడంతో కబ్జా గ్యాంగ్ తోక ముడిచింది. ఈనెల 2న ‘కబ్జాలకు అండగా.. కమీషనర్’ పేరుతో ఖమ్మం (Khammam) శివారు ప్రాంతంలో జరుగుతున్న కబ్జా బాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది ‘రాష్ట్ర’. ప్రభుత్వ సర్వేను ఓ ముఠా అడ్డుకుంటోందని.. దీనికి ఎండోమెంట్ లో పని చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ కు సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలను వివరంగా చెబుతూ బాధితుల బాధను వివరించింది. దీంతో కబ్జాకోరుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు ఖమ్మం అర్బన్ ఖానాపూర్ (Khanapur) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
అసలేం జరిగింది..?
ఖమ్మం నగర శివారులో శ్రీశ్రీ సర్కిల్ దగ్గర సర్వే నెంబర్ 504లో మూడు ఎకరాల భూమి చుట్టూ వివాదం నడుస్తోంది. దీనికి తూర్పున ఓ ప్రైవేట్ భూమి ఉంది. అయితే.. ఓ ముఠాని రంగంలోకి దింపి ఆ భూమిని కాజేయాలని కుట్రలు పన్నుతున్నట్టు తెలిసింది. ఈ వివాదంలో ఇతరులు ఇబ్బంది పడుతున్నా ఎండోమెంట్ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి. భూమిని రౌడీ మూకలకు అప్పజెప్పి తమ షేర్ తాము దక్కించుకునే ఎత్తుగడలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. 1966లో వైరా రోడ్డు 20 నుంచి 30 అడుగులు ఉండగా.. అది ఇప్పుడు 180 అడుగులకు పెరిగింది. ఇరువైపులా ఉన్న స్థలాల నుంచి ఈ రోడ్డు వేశారు. అయితే.. 1966లో 3 ఎకరాల 10 గుంటల స్థలం అని రిజిస్టర్ అయి ఉండగా.. రోడ్డు విస్తీర్ణం పెరిగినా ఇప్పటికీ తమకు అంతే భూమి ఉందని వాదనలకు దిగటం, పక్కవారికి చెందిన భూమిని తమదేనని హల్చల్ చేయటం వివాదానికి కారణమైంది. ఈ 3.10 ఎకరాల భూమికి, పక్కనే ఉన్న 2 ఎకరాల భూమికి ఎలాంటి సంబంధం లేదు. అయితే.. ఆ స్థలం కాజేయాలనే ఉద్దేశంతో కొందరు తెరచాటున రౌడీ మూకలను దింపారని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల నుంచి సహకారం ఉన్నట్టు బాధితుల వెర్షన్.
ఎట్టకేలకు కేసు నమోదు
ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూమిలో శుక్రవారం సర్వే చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఆ భూమికి పక్కన ఉన్న భూ హక్కుదారులు అయిన మరో నలుగురికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీస్ శాఖకు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు అందుకున్న వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ భూమి వద్దకు చేరుకున్నారు. దీన్ని అదునుగా చేసుకొని పొదిల పాపారావు, చిన్న పాపారావు, కరుణ హోటల్ నాగేశ్వరరావుతో సహా సుమారు 20 మంది వచ్చి మూకుమ్మడిగా దాడి చేశారని వెంకటరమణ చెబుతున్నాడు. ఇదే సమయంలో ఈ భూ వివాదంపై ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో పోలీసులు పొదిల పాపారావుతో సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఖానాపూర్ స్టేషన్ సీఐ శ్రీహరి వివరాలు తెలిపారు. వీరంతా పరారీలో ఉన్నట్లు, రెండు బృందాలతో గాలిస్తున్నట్లు, ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రైవేట్ భూమిలో అక్రమంగా నిర్మించిన షెడ్డును కేసు నమోదు అనంతరం ఆక్రమణదారులు తొలగించారు.