కాంగ్రెస్ (Congress) పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ కేవలం దోపిడీకి మాత్రమే హామీ ఇవ్వగలదని విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి నిధులను సమకూర్చు కునేందుకు అవినీతి ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
కర్ణాటకలో ఇటీవల కాంట్రాక్టర్లపై దర్యాప్తు సంస్థలు జరిపిన దాడుల్లో 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని తెలిపారు. అది అత్యంత సిగ్గు చేటు అని మండిపడ్డారు. అది కాంగ్రెస్ అవినీతి డీఎన్ఏకు శాంపిల్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, అవినీతి (Corruption)లు నాణానికి బొమ్మా బొరుసులాంటివన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లను కాంగ్రెస్ తన అవినీతి ఏటీఎంలుగా మార్చుకుందన్నారు.
ప్రజా ధనాన్ని దోచుకునేందుకు తెలంగాణ, మధ్య ప్రదేశ్ లను ఏటీఎంలుగా మార్చుకోవాలని చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, మధ్య ప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోదన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో అధికారం సంపాదించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రా ధనాన్ని లూటీ చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు.
వాగ్దానాలు చేయడంలో కాంగ్రెస్ కు మంచి ప్రావీణ్యం ఉందన్నారు. ఇప్పుడు వాగ్దానాలకు బదులు గ్యారెంటీలు అంటూ మరో అడుగు ముందుకు వేసిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అవినీతి పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ ఎల్లప్పుడూ అవినీతికి దారి తీస్తాయని స్పష్టమైందన్నారు. అందువల్ల బీజపీని గెలిపించాలని కోరారు.