– జనగామలో ప్రజా ఆశీర్వాద సభ
– గులాబీ కండువా కప్పుకున్న పొన్నాల
– కేసీఆర్.. అభివృద్ధి ప్రదాత అంటూ కితాబు
– కాంగ్రెస్ లో ఎన్నో అవమానాలు పడ్డానన్న పొన్నాల
– ఆలోచించి ఓటెయ్యాలన్న సీఎం
– పల్లాను గెలిపించాలని వినతి
– కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయాలని పిలుపు
ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ జరగగా.. ఈమధ్యే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్యయ్య బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 45 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని.. ఈ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని.. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కోరుతున్నానని స్పష్టం చేశారు పొన్నాల.
ఇక కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతారని.. అలాంటి వారిని నమ్మెద్దన్నారు. జనగామకు త్వరలోనే దేవాదుల, కాళేశ్వరం నుండి నీళ్లు రాబోతున్నాయని.. ఎక్కడ కరువు వచ్చినా జనగామలో మాత్రం రాదని తెలిపారు. తెలంగాణ వచ్చాక నాలుగైదు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మేథోమధనం చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటుకు ముందు కొన్ని జిల్లాలకు వెళ్తే తనకు ఏడుపొచ్చేదని.. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే దీనంగా ఉండేదని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే.. ఊరిలోని యువకులంతా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లారని తెలిసిందన్నారు. ఇప్పుడు బచ్చన్నపేట చెరువులో 365 రోజులూ నీళ్లు ఉంటున్నాయన్న కేసీఆర్.. భవిష్యత్ లో జనగామ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలు, ఐటీ కారిడార్లతో భవిష్యత్ లో జనగామ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో కరెంట్ కష్టాలు, నీటి కొరత లేదని తెలిపారు. రైతుల బాధలు తనకు తెలుసని.. అందుకే భూమిపై అధికారుల అధికారాన్ని తీసేసి.. మీ భూమి మీద మీకే అధికారాన్ని ఇచ్చామని తెలిపారు. కానీ, పాస్ బుక్లో కౌలు రైతులను చేర్చాలని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. తన ప్రాణం పోయినా ధరణి తీసే పరిస్థితి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారని అంటున్నారని.. ధరణిని కాదు ఆపార్టీనే బంగాళాఖాతంలో పడేయాలని ఫైరయ్యారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ వీఆర్వోలు వస్తారని మంచి చెడు ఆలోచించి ఓటేయ్యండని సూచించారు.