నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ (Darmapuri Aravind) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR), ఆయన కుమారుడు కేటీఆర్ మరణిస్తే తమ పార్టీ నగదు బహుమతి ఇస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. అరవింద్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంగళవారం ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మెనిఫెస్టో గురించి ప్రస్తావిస్తూ ఆ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మరణించిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం కింద రూ. 5 లక్షల బీమా ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించిందన్నారు.
56 ఏండ్లు నిండిన రైతులకు మాత్రమే ఈ బీమా వర్తింస్తుందని మెనిఫెస్టోలో కొర్రీలు పెట్టిందని పేర్కొన్నారు. దీనిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చనిపోతే తమ పార్టీ రూ. 5 లక్షలు ఇస్తుందన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ చనిపోతే ఆ మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచుతామని అన్నారు. కేసీఆర్ సర్కార్ కు సమయం దగ్గర పడిందన్నారు.
తక్కువ వయస్సు ఉన్న వారు చనిపోతే ఎక్కువ డబ్బు వస్తుందని బీఆర్ఎస్ మాటల ప్రకారం… కవిత చనిపోతే తాను రూ. 20 లక్షలు అందజేస్తానన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అరవింద్ వ్యాఖ్యలను తాము ఆయన కూతుళ్లపై చేస్తే మౌనంగా చూస్తూ ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కూతురి మీదే ఇలా మాట్లాడుతారా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు ఇదేం రాజకీయమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.