పాలస్తీనా కు సహాయం చేసున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళాన్ని ఇస్తున్నట్టు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Award) గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ (Malala Yousafzai) విరాళాన్ని ప్రకటించారు. ఆ సంస్థలకు రూ. 2.5 కోట్ల విరాళంగా అందజేస్తున్నట్టు వెల్లడించారు. గాజాలో ఆస్పత్రిపై జరిగిన దాడిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గాజాలో అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిని చూసి తాను భయాందోళనలకు గురయ్యానని మలాలా తెలిపారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సామూహిక శిక్ష అనేది సమాధానం కాదని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సందేశాన్ని విడుదల చేశారు.
గాజాలోని పౌరులకు మానవతా సహాయాన్ని అందించేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని సూచించారు. పాలస్తీనియన్ ప్రజలకు సహాయం చేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను 3 లక్షల డాలర్లు విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.
గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై మంగళవారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 500 మందికి పైగా మరణించారు. ఈ ఘటను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు బాధ్యత మీరంటే మీరంటూ ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.