హైదరాబాద్ ప్యాసింజర్స్‌కు మరో చేదువార్త. ఇంతకాలం మెట్రో(HYDERABAD METRO)లో ప్రయాణించే వారికి అందిస్తున్న పలు రాయితీలను(DISCOUNTS) ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో మెట్రో ప్రయాణం భారం కానుందని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే, రాయితీలు రద్దు చేయడానికి గల కారణాలను మెట్రో అధికారులు వివరించారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో మెట్రో ప్రయాణానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ఆఫర్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రూ.59 హాలీడే కార్డు, మెట్రో కార్డుపై ఇచ్చే 10 శాతం రాయితీలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో యూపీఐ యాప్స్ ద్వారా మెట్రో టికెట్ బుక్ చేసిన సమయంలో ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్‌ను కూడా మెట్రో అధికారులు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఉన్నఫలంగా రాయితీలు రద్దు చేయడంపై ప్రయాణికులు మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రయాణీకుల రద్దీ పెరగడంతో కోచ్‌ల సంఖ్యను పెంచాలని నగరవాసులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
మెట్రో చార్జీలు నగరంలో తిరిగే బస్సు చార్జీలతో సమానంగా ఉండటంతో చాలా మంది మెట్రోనే ప్రిఫర్ చేస్తున్నారని తెలిసింది.నగరంలో ట్రాఫిక్ సమస్య, ఎండల తీవ్రతకు మెట్రో అనుకూలంగా ఉంటుదని ప్రయాణికులు భావిస్తుండటంతో రద్దీ భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.