హైదరాబాద్ మహానగర పరిధి రాజేంద్రనగర్ లోని కాటేదాన్ బిస్కెట్ ఫ్యాక్టరీలో (Biscuit Factory) భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలకు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.
మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం తీవ్రతకు భవనానికి పగుళ్లు ఏర్పడి పిల్లర్లు కుంగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనేది ఇంకా తెలియడం రాలేదు.
బిస్కెట్ ఫ్యాక్టరీని ఆనుకుని అనేక కట్టడాలు ఉన్నాయి. కాటేదాన్‌లో బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉన్నాయి.అయితే,ఈ మంటలు పక్క బిల్డింగ్ కు వ్యాపించే లోపు వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వేడి తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో సిబ్బంది ముందుకు వెళ్లలేకపోతున్నారని సమాచారం.
అగ్నిప్రమాదంలో బిల్డింగ్ మొత్తం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. లోపల మొత్తం ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో అగ్ని తీవ్రత మరింత పెరిగినట్లు అర్థమవుతోంది.ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా అయ్యుంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. కానీ, కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.