సాధారణ మహిళలకే కాదు ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కూడా వేధింపులు తప్పడం లేదు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ నగరంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ పదవిలో ఉన్న ఆనంద్ కుమార్ చొరబడటం తీవ్ర కలకలమే రేపింది. ఈ ఘటన మరవముందే హైదరాబాద్‌లో మరో మహిళా ఐఏఎస్ కూడా వేధింపుల బారిన పడటం షాకింగ్‌గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి మహిళ ఐఏఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. సదరు మహిళా ఐఏఎస్ ఓ ప్రభుత్వ విభాగం సంచాలకురాలిగా ఉన్నారు.
అయితే ఆమెను కలిసేందుకు శివప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. తాను మహిళా ఐఏఎస్‌కు అభిమానిని అని చెప్పుకుంటే.. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతున్నానని చెప్పుకుంటున్నాడు. కొన్ని వారల కిందట మహిళా ఐఏఎస్‌ను కలిసేందుకు ఆమె విధులు నిర్వర్తిస్తున్న కార్యాలయానికి కూడా వెళ్లాడు.
అయితే తరుచూ శివప్రసాద్ తనను కలిసేందుకు వస్తున్నాడనే విషయం తెలుసుకున్న మహిళా ఐఏఎస్.. అతడిని ఎట్టి పరిస్థితుల్లో లోనికి పంపొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే శివప్రసాద్.. మహిళా ఐఏఎస్ నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ కనుక్కుని నేరుగా అక్కడికి వెళ్లాడు. అక్కడి సిబ్బందితో తాను మేడమ్‌ను కలవడానికి వచ్చానని, స్వీట్స్ బాక్స్ ఇచ్చి వెళ్తానని చెప్పాడు.
అయితే సిబ్బంది అందుకు అనుమతించకుండా శివప్రసాద్‌ను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే తరుచూ శివప్రసాద్ నుంచి ఇలాంటి వేధింపులు ఎదురుకావడంతో ఐఏఎస్ అధికారిణి కార్యాలయ అదనపు సంచాలకుడు సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు శివప్రసాద్‌పై 354 డీ కింద కేసు నమోదు చేశారు.