ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను(Cm kejiriwal) ఈడీ అరెస్టు చేసిన ఘటనలో దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీలు కేంద్రంలోని బీజేపీని(BJP) టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు వారికి గట్టిగా కౌంటర్ వేస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టు అక్రమం, అన్యాయం అయితే..ఢిల్లీ మద్యం(Delhi liquer Scam) కుంభకోణంలో లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది సీఎం కేజ్రీవాలే అని.. ఈ మద్యం పాలసీ ద్వారా భారీగా అవినీతి జరిగిందని, ప్రైవేట్ వ్యక్తులకు పెద్దఎత్తున లబ్ది చేకూరేలా పాలసీని విధివిధానాలు ఉన్నాయని ఆ రాష్ట్ర సీఎస్ ఫిర్యాదుతో లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించగా.. సీబీఐతో పాటు ఈడీ రంగప్రవేశం చేశారని కమలం పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
వాస్తవానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవినీతికి పాల్పడకపోతే ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేస్తే ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. తప్పు చేయనపుడు భయం ఎందుకు అని అడిగారు. లిక్కర్ కుంభకోణం జరిగిందని వాస్తవమని, ఇప్పటికే ఆ స్కాంతో సంబంధం ఉన్నా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ఏడాదిగా జైల్లో ఉన్నారని, ఇటీవలే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కొందరు నిందితులు అప్రూవర్‌గా మారారని, వారి వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలాఉండగా కేజ్రీవాల్ అరెస్టు అనంతరం ఆయనకు గురువారం రాత్రి వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు.. నేడు (శుక్రవారం) ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం 11 గంటలకు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను విచారించేందుకు 10 రోజుల కస్టడీని ఈడీ కోరనున్నట్లు సమాచారం. కాగా, కేజ్రీవాల్ అక్రమ అరెస్టును నిలుపుదల (స్టే) కోరుతూ గురువారం రాత్రి సుప్రీంకోర్టులో ఆప్ నేతలు అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా..నేడు అది విచారణకు రానుంది. సుప్రీం తీర్పు ఢిల్లీ సీఎంకు అనుకూలంగా వస్తుందా? లేదా వ్యతిరేకంగా వస్తుందా? కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిస్తుందా? లేదా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.