ఉప్పల్ (Uppal)లో 16 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 3వ తేదీన ఉప్పల్ బస్ స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న బాలికకు సాదక్ అనే వృద్దుడు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు సమాచారం. అయితే సదరు బాలిక ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం.. ఆపై మౌనంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానంతో ఆరాతీసినట్టు తెలిసింది.
దీంతో జరిగిన ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడు సాదక్ను గుర్తించి అరెస్టు చేశారు. కాగా పాతబస్తీకి చెందిన షేక్ సాదక్ (60) ఉప్పల్ బస్టాండు ప్రాంతంలోని ఓ కట్టెల మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిపిన పోలీసులు, నిందితుడుని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన పాతబస్తీ (Old City) బండ్లగూడ (Bandlaguda) పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకొంది.
సూర్యాపేట (Suryapet)కు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన సోదరుడితో గొడవ జరగ్గా.. మనస్తాపానికి గురైన యువతి హైదరాబాద్ (Hyderabad) బస్సెక్కింది. శనివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ (MGBS) బస్టాండులో దిగింది. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న యువతి ఇద్దరు కామాంధుల కంటపడింది.
గౌస్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ (22), అఫ్జల్‌గంజ్‌కు చెందిన కాశీవిశ్వనాథ్ (32) ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించారు. కొంత దూరం వెళ్ళాక మాటలు కలిపి ఎలాగోలా ఆయువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం.. అనంతరం ఆ యువతిని మరోచోటికి తరలిస్తుండగా.. బాధితురాలు అరిచింది. స్థానికులు గమనించడంతో నిందితులు పరారయ్యారు.
స్థానికుల సమాచారంతో చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.గురునాథ్, బండ్లగూడ ఎస్సై వెంకటేశ్వర్ ఘటనాస్థలానికి చేరుకొన్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనపై అఘాయిత్యం జరిగిన స్క్రాప్ గోడౌన్‌ను చూపించగా.. అది శ్రీకాంత్దని తెలుసుకొన్న పోలీసులు నిందితుడిని పట్టుకొన్నారు. అతనిచ్చిన సమాచారంతో మరో నిందితుడు కాశీవిశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకొన్నారు.