– విద్యా రంగంలో బలమైన మార్పులు
– వి జోయిస్ట్, అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం
– భారతీయ విద్యార్థులకు యూరోప్ తరహా విద్య
– సాంకేతికతతో అనుసంధానం
– వి జోయిస్ట్ ఇన్నోవేషన్ హెడ్ శిరీష్ వెల్లడి
దేశంలో విద్యా రంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో సీఐఐ రెండో ఇండో-యూరోప్ కాన్ క్లేవ్ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం వీ జోయిస్ట్ కంపెనీతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. వి జోయిస్ట్ కంపెనీ అనేది ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థ యోగ్యతా కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, ఏజెన్సీలు, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్, వ్యాపార మద్దతు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్ లపై ఆధారపడిన కంపెనీ. జోయిస్ట్ ఇన్నోవేషన్ పార్క్, వారిమన్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలు కలిసి వి జోయిస్ట్ కంపెనీని ఏర్పాటు చేశాయి.
ఎంఓయూపై సంతకం చేయడంతో అదానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి పి సింగ్, వి జోయిస్ట్ ఇన్నోవేషన్ పార్క్ హెడ్ టాసోస్ వాసిలియాడిస్ రెండు దేశాల మధ్య విద్యారంగంలో విప్లవాత్మక అడుగుకు నాంది పలికారు. ఈ ఎంఓయూతో యూరోప్ తరహాలో భారత్ లో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సదరు కంపెనీలు కలిసి పని చేయనున్నాయి. దీనిపై వి జోయిస్ట్ ఇన్నోవేషన్ పార్క్ హెడ్ డీ శిరీష్ మాట్లాడుతూ.. తమ ప్లాన్ తో భవిష్యత్తులో భారతీయ విద్యార్థులు యూరోప్ తరహాలో విద్యను అభ్యసించగలుగుతారని చెప్పారు. సాంకేతికతతో అనుసంధానం అవుతారని అన్నారు.
అదానీ విశ్వవిద్యాలయం చాలా కాలంగా విద్యా రంగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు విద్యను సాంకేతికతతో మరింత పటిష్టంగా అనుసంధానించడానికి వి జోయిస్ట్ ఇన్నోవేషన్ పార్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ సహాయంతో అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.
మరోవైపు, భారత్-గ్రీస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్.. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం అయ్యేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాణిజ్యం, రక్షణ ఉత్పత్తులు, ఉగ్రవాదంపై పోరు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని దృఢపరచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా మోడీ, మిత్సోటాకిస్ నిర్ణయించారు. 15 ఏళ్లలో గ్రీస్ దేశాధినేత భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉగ్రవాదంపై పోరులో భారత్, గ్రీస్ లకు ఉమ్మడి ఆందోళనలు, ప్రాధాన్యతలు ఉన్నాయని పీఎం ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది.