పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి (TMC Chief) మమతా బెనర్జీ (Mamatha Benrjee) పై కాంగ్రెస్ అగ్రనేత అధిర్ రంజన్ చౌదరి ( Adhir Ranjan Chowdhury )తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బెంగాల్లో కాంగ్రెస్కు మమతా బెనర్జీ కేవలం రెండు సీట్లను మాత్రమే ఆఫర్ చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎప్పుడూ సీట్ల కోసం వెంపర్లాడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మద్దతుతోనే బెంగాల్లో అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని మమతా బెనర్జీ గుర్తుంచుకోవాలని చెప్పారు. మమతా బెనర్జీ ఒక అవకాశవాది అంటూ నిప్పులు చెరిగారు. తన సొంత బలంతో ఎన్నికల్లో ఎలా పోరాటం చేయాలో కాంగ్రెస్ కు తెలుసన్నారు.
రాబోయే ఎన్నికల్లో దీదీ సహాయం లేకుండానే తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. మమతా బెనర్జీకి ప్రధాని మోడీకి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లోనూ అదే జరిగిందన్నారు. మోడీ ఎప్పుడూ హిందు ఓటు బ్యాంకును నమ్ముకుంటారని పేర్కొన్నారు.
అలాగే మమతా బెనర్జీ కూడా ముస్లిం ఓటు బ్యాంకును నమ్ముకుంటుందన్నారు. 2019లో బీజేపీ, టీఎంసీలతో పోటీ చేసి ఈ రెండు సీట్లను తాము గెలుచుకున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తమకు ఎవరి సానుభూమతి అవసరం లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు టీఎంసీని అవినీతి క్యాన్సర్ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..