మూడు రోజుల నుంచి ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీగా మంచు(Snow) కురువడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 15 మంది మృతిచెందగా దాదాపు 30మంది గాయాలపాలయ్యారు.
ఈ ప్రకృతి బీభత్సంతో మూగ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. బాల్ట్, ఫర్యాబ్ ప్రావిన్సుల నుంచి అందిన సమాచారం మేరకు.. మంచు కారణంగా సుమారు 10వేల జంతువులు మృత్యువాతపడ్డాయి. కొన్ని రోజులుగా నిరంతరంగా మంచు కురుస్తోంది. దీంతో చాలా వరకు నష్టం వాటిల్లుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రోడ్లపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో అన్ని రవాణా మార్గాలు మూసుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అనేక జంతువులు కూడా ఆకలితో చనిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
మంచు కురుస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలు ఆకలితో విలపిస్తున్నారని తెలిపారు. పశువుల యజమానులు ఎదుర్కొంటున్న నష్టాల పరిష్కారానికి వివిధ మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశువుల యజమానులకు సాయం చేయడానికి అధికారులు 50 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించారు.