సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ ప్రజలకు చరిత్రాత్మకమైన రోజు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్దించిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారన్నారు.
తుక్కుగూడ కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకు వచ్చిందన్నారు. ఆహార భద్రత చట్టాన్ని తీసుకు వచ్చి ఈ దేశ ప్రజల ఆకలిని కాంగ్రెస్ తీర్చిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు.
తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటిస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నింటినీ ఆమలు చేస్తామన్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. పట్టా భూమి గల రైతులతో పాటు కౌలు రైతులకు సైతం రూ.15 వేలు రైతు భరోసా కింద ఇస్తామన్నారు.
పత్రి ఏడాది రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామన్నారు. వరి పంటకు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. కేవలం పైకి చూసేందుకు మాత్రమే మోడీ, కేసీఆర్ విమర్శలు చేసుకుంటారన్నారు. కానీ వారి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. బీజీపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల నుంచి అప్రమత్తంగా వుండాలన్నారు.