వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin). ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఈయన చేసే వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారి తీస్తాయి. తాజాగా మరోసారి ఆయన రెచ్చిపోయారు. ఏకంగా ఓ పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గం చాంద్రాయణగుట్ట (Chandrayangutta) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అక్బరుద్దీన్. ఈ క్రమంలోనే సంతోష్ నగర్ (Santosh Nagar) పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మళ్లీ తననే గెలిపించాలని ప్రజలను కోరారు. అయితే.. ఎన్నికల నియమావళి ప్రకారం.. రాత్రి 10 గంటల తరువాత ప్రచార కార్యక్రమాలను నిర్వహించకూడదు. ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది. 10 గంటల సమయంలోనూ అక్బరుద్దీన్ ప్రసంగిస్తుండగా సంతోష్ నగర్ సీఐ శివచంద్ర (CI Siva Chandra) అడ్డుకున్నారు.
సమయం అయిపోయిందని సీఐ గుర్తు చేయగా.. అక్బరుద్దీన్ ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేజీపై నుంచి పోలీసులపైకి దూసుకెళ్లారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాల తరువాత భయపడ్డానని, బలహీనపడ్డానని అనుకున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. నన్ను ఆపే వ్యక్తి ఇంతవరకు పుట్టలేదు అని అన్నారు. తన వద్ద కూడా వాచీ ఉందని, ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని చెప్పారు అక్బరుద్దీన్. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.
తాను కనుసైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు అక్బర్. అక్బరుద్దీన్ తో పోటీ పడేందుకు వస్తున్నారు.. రానీయండి ఎలా గెలుస్తారో చూద్దామని ప్రజలనుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. ఒవైసీ తీరుపై ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. సమయం గురించి పోలీసులు గుర్తు చేసినందుకే ఇంతగా రెచ్చిపోవాలా అని నిలదీస్తున్నారు.