రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. సరైన సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో విమర్శలు ఎదురవుతున్నాయి.. ఈ క్రమంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లా, ప్రభుత్వాసుపత్రి (Government Hospital)లో విషాద ఘటన చోటు చేసుకొంది.
బోధన్ (Bodhan) మండలానికి చెందిన పెద్ద మావండి గ్రామానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి బలైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. తలనొప్పి, నీరసంగా ఉందని శనివారం మధ్యాహ్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపిన వారు.. ఆదివారం ఉదయం ఏడు గంటల వరకు మాధవరావు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు..
ఈ క్రమంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.. మృతుడి కుమారుడు వైద్యులు సరైన చికిత్స అందించలేదని ఆరోపించాడు. మరోవైపు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో, రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ కనీసం వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
ఈ విషయంలో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. డాక్టర్లు, నర్సులు కేవలం టైంపాస్‌కు మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే రోగి చనిపోయాడని తెలిసిన కొందరు జర్నలిస్టులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకొని ఫోటోలు తీస్తుండగా, అక్కడున్న సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడం కలకలం సృష్టించింది..