ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Ikon Star Allu Arjun) మరో మైలురాయిని చేరుకున్నారు. మొన్నటివరకు ఒకలెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నాడు మన ‘పుష్పరాజ్’.. అల్లు అర్జున్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ మూవీస్ ఉన్నా..ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘పుష్ప’(Pushpa) మాత్రమే.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీలో బన్నీ నటనకు గాను భారత ప్రభుత్వం ‘నేషనల్ అవార్డు’ను సైతం ప్రకటించింది.
దీంతో మనోడు మరోసారి ‘తగ్గేదేలే’ అంటూ పుష్ప-2తో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప హైయ్యెస్ట్ కలెక్షన్స్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల్లో మనోడికి మాస్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచేసింది. దీనికి తోడు బాలీవుడ్ మొత్తం బన్నీ జపం చేస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బన్నీకి వీరాభిమాని అయిపోయాడు.పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులు వేయడంతో పాటు ఇటీవల బన్నీ బర్త్ డేకు విషెస్ కూడా చెప్పాడు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు.మేడం టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని(wax statue) మార్చి 28న ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం దుబాయ్‌కు వెళ్లింది. అయితే, దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు కానున్న తొలి దక్షిణాది హీరో మైనపు విగ్రహం అల్లు అర్జున్ ది కావడం విశేషం.
ఇదివరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలను ఏర్పాటు చేసిన అవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. దుబాయ్‌లో మ్యూజియంలో మాత్రం సౌత్ నుంచి బన్నీ ఈ చాన్స్ దక్కించుకున్నాడు. మార్చి 28న రాత్రి 8 గంటల ప్రాంతంలో అల్లుఅర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
కాగా, దుబాయ్ మ్యూజియంలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. సింగపూర్, లండన్, దుబాయ్‌లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం శాఖలు కొనసాగుతున్నాయి. ఇకపోతే అల్లుఅర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను కూడా కల్పించిన విషయం తెలిసిందే.