ప్రముఖ ఈ కామర్స్ (E-Commerce) సంస్థ అమెజాన్‌కు (Amazon) సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)షాక్ ఇచ్చింది. ‘శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం’అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటన చేస్తూ మిఠాయిల విక్రయం చేస్తుండటంపై అమెజాన్‌కు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది.
ప్రసాదం (నైవేద్యం) పేరుతో స్వీట్ల విక్రయాలకు పాల్పడుతూ మోసపూరిత వ్యాపార విధానాలకు అమెజాన్ పాల్పడుతోందని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ఫిర్యాదు ఆధారంగా సీసీపీఏ ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. నోటీసులపై వారంలోగా సమాధానం ఇవ్వాలని అమెజాన్ ను ఆదేశించింది.
నోటీసులకు సమాధానం ఇవ్వని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం- 2019 నిబంధనల ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకుంటామని సీసీపీఏ హెచ్చరించింది. అమెజాన్‌లో వివిధ మిఠాయిలు/ఆహార ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని అధికారులు గమనించారని పేర్కొంది.
వాటిని “శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్” అని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో ఆహార ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించడం ద్వారా ఆయా స్వీట్ల అసలైన లక్షణాలకు సంబంధించి వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నట్టు గుర్తించామని వెల్లడించింది. అమెజాన్‌లో ‘శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్ – రఘుపతి నెయ్యి లాడూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడూ, రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్ – దేశీ ఆవు పాలు పెడా,’ వంటివి ఉన్నాయి.