మాజీ టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీ(YCP)లో చేరి 10 రోజులు తిరక్కుండానే సీఎం జగన్(CM Jagan)కు గుడ్‌బై చెప్పాడు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని.. సరైన సమయంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపాడు.
క్రికెట్‌లో దూకుడు నిర్ణయాలు తీసుకునే రాయుడు రాజకీయాల్లోనూ అదే ప్రదర్శనను చూపుతున్నాడు. గత నెల డిసెంబర్ 28న వైసీపీలో చేరిన ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అనూహ్యమైన ట్వీట్ వచ్చింది.
‘జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్‌లు ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయాణాలు మంచిగా సాగాలని కోరుకుంటున్నాం’ అని రాయుడిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేవిధంగా అంబటి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సైకో అని తెలిసే వారం రోజులకే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశాడని అన్నారు. ఇవాళ తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ అంబటి రాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.
2024లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఖాయమని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తమ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. టీడీపీలో పదవులు ఇవ్వడంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వెంకన్న చెప్పుకొచ్చారు. రాజ్యసభల్లో ఫ్లోర్ లీడర్ పదవి ఆర్.కృష్ణయ్యకు ఎందుకు ఇవ్వలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.