అమెరికా(USA)లోని జార్జియా స్టేట్, బెయిన్బ్రిడ్జ్లో కోతుల కోసం ఏకంగా మినీ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. సేఫర్ హ్యూమన్ మెడిసిన్(Safer Human Medicine) కంపెనీ బెయిన్బ్రిడ్జ్లో 30వేల కోతులను పెంచేందుకు సిద్ధమైంది.
సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పట్టణవాసులు ఆ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లో కోతుల పెంపకంపై ప్రజలతోపాటు జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
అయితే, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్ కంపెనీలకు పంపిస్తామని సేఫర్ హ్యూమన్ మెడిసిన్ కంపెనీ చెబుతోంది. వీటి వల్ల ఈ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది.
అయినప్పటికీ స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దాదాపు 14వేల జనాభాగల ఈ పట్టణంలో 30వేల కోతులు ఉండటాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చిచెబుతున్నారు. ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.