-కేసీఆర్ ను గద్దె దించి బీజేపీకి అధికారం ఇవ్వాలి
-అందుకోసం ప్రజలంతా పిడికిలి బిగించాలి
-నేటి తరం రజాకర్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేది బీజేపీనే
-డిసెంబర్-3 న హైదరాబాద్ లో బీజేపీ జెండా ఎగరాలి
-పదేండ్లలో తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు
-కేవలం తన కుటుంబం గురించే ఆలోచించారు
-కేసీఆర్ ఆలోచనంతా కేటీఆర్ ను ఎలా సీఎం చేయాలనే
-ఎన్నికలొస్తే కొత్త దుస్తులు వేసుకుని కాంగ్రెస్ వాళ్లు వస్తారు
-పేదల గురించి మాట్లాడటమే తప్ప వారికోసం ఏమి చేయరు
-రామ మందిర విషయాన్ని ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ నాన్చింది
-ఆదిలాబాద్ జన గర్జన సభలో అమిత్ షా
తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) రాజ్యాన్ని తీసుకురావాలని ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పిలుపు నిచ్చారు. కేసీఆర్ సర్కార్ ను గద్దెదించి బీజేపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు పిడికిలి బిగించాలన్నారు. నేటి తరం రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
అదిలాబాద్ బీజేపీ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ పవిత్ర భూమి అని అన్నారు. ఈ భూమి కొమురం భీమ్ నడయాడిన జిల్లా అని తెలిపారు. కుమ్రం భీం పేరు చెప్పగానే రోమాలు నిక్క బొడుచుకుంటాయన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించండని పిలుపు నిచ్చారు. ఇక్కడి నినాదాలు హైదరాబాద్ లో కేసీఆర్ కు వినిపించాలన్నారు.
మన దేశంలో రెండు స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయన్నారు. ఒకటి బ్రిటీష్ వాళ్లపై జరిగితే రెండో ది నిజాంపై జరిగిందన్నారు. రజాకార్లపై పోరాడిన వీరభూమికి తాను తల వంచి నమస్కారం చేస్తున్నాని అన్నారు. తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తోందని చెప్పారు.
డిసెంబర్3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్సడాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి వర్శిటీ ఏర్పాటుకు ప్రధాని మోడీ ప్రయత్నించారన్నారు. ట్రైబల్ వర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. పసుపు బోర్డు, కృష్ణ ట్రిబ్యునల్ ప్రధాని మోడీ ఘనతేనని ఆయన వివరించారు.
మహళిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకు వచ్చామని చెప్పారు. ఆదివాసీల కోసం కేసీఆర్ సర్కార్ ఏమీ చేయలేదని మండిపడ్డారు. ఈ పదేండ్లలో కేటీఆర్ ను ఎలా సీఎం చేయాలని మాత్రమే కేసీఆర్ ఆలోచించారన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉన్నది మోడీ సర్కార్ మాత్రమేనన్నారు. ప్రతి పేద మహిళకు మోడీ వంట గ్యాస్ ఇచ్చారని చెప్పారు. రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 6వేలు జమ చేస్తున్నామని గుర్తు చేశారు.
ఈ తొమ్మిదేండ్ల కాలంలో దళితులు, గిరిజనుల కోసం ప్రధాని మోడీ ఎన్నో కార్యక్రమాలు తీసుకు వచ్చారన్నారు. కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తారంటూ ఎద్దేవా చేశారు. పేదల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది కానీ…పేదల కోసం ఏం చేయదని ఫైర్ అయ్యారు.
గిరిజనుల కోసం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ వాటిని అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. ఆదివాసీలకు కేసీఆర్ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా? అని అడిగారు. అడ్డంకులను అధిగమించి మోడీ సర్కార్ ఇప్పుడు అయో ధ్యలో రామమందిరం నిర్మిస్తోందన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించామన్నారు. మోడీ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టిందన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదన్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టాలా వద్దా అని ప్రశ్నించారు. రామ మందిర వ్యవహారాన్ని ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ నాన్చి పెట్టిందన్నారు. దేశాన్ని కాంగ్రెస్, కేసీఆర్ రక్షించలేరన్నారు. నేటి తరం రజాకర్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీ మాత్రమేనన్నారు.
తెలంగాణను నెంబర్ వన్ చేశానని కేసీఆర్ అంటున్నారన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణను నంబర్ వన్ 1 చేశారని ఫైర్ అయ్యారు. మహిళలు, బాలికలపై అత్యాచారాల్లో తెలంగాణను నంబర్ వన్ గా కేసీఆర్ నిలిపారన్నారు. అవినీతి, కుంభ కోణాల్లో తెలంగాణ నంబర్ 1గా మార్చారన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో పని చేసే ప్రభుత్వాన్ని తరిమి కొట్టండన్నారు.
ఆదివాసీల కోసం మోడీ సర్కార్ లక్ష కోట్లు ఖర్చు చేసిందన్నారు. యూపీఏ ఎంత ఖర్చు చేసిందో రాహుల్ గాంధీ చెప్పగలరా అని ప్రశ్నించారు. గిరిజనులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి ఎక్కడకు వెళ్లిందని ప్రశ్నించారు. దళితులకు ఇస్తామన్న పది లక్షల రూపాయుల ఏమయ్యాయన్నారు. జీ-20 సదస్సులో ప్రపంచం దేశాలన్నీ మోడీని ప్రశంసించాయన్నారు.