ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సీఏఏ అమలు మంట రేపుతోంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. అమిత్ షా (Amit Shah) వాటిని కొట్టిపారేశారు. 2019 లోక్సభ ఎన్నికల మేనిఫేస్టోలో CCAను అమలు చేస్తామని బీజేపీ (BJP) చెప్పిందని గుర్తుచేశారు. పార్లమెంటు (Parliament)లో ఆమోదం పొందినప్పటికీ కొవిడ్ కారణంగానే అమలు ఆలస్యమైనట్లు వివరించారు.
అదేవిధంగా గత నాలుగేళ్లలో 41 సార్లు ఎన్నికల కంటే ముందే సీఏఏను అమలు చేస్తామని తాను చెప్పినట్లు అమిత్ షా వెల్లడించారు. మరోవైపు సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన ఆయన.. ప్రతిపక్షాలన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.. ఈ విషయంలో రాజీపడబోమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
మతం ఆధారంగానే 1947లో దేశ విభజన జరిగిందన్న అమిత్ షా.. వలస వెళ్లినవారు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. అయితే బుజ్జగింపు రాజకీయాల కారణంగానే నాడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవడంలేదని ఆరోపించారు.. ఇక CCA అమలు విషయంలో మైనార్టీలు భయపడాల్సిన పనిలేదని, ఎవరి పౌరసత్వం రద్దుచేసే నిబంధన సీఏఏలో లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
మరోవైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, బౌద్ద, జైన, సిక్కు, క్రిస్టియన్, పార్సీ శరణార్థులకు పౌరసత్వం, హక్కులను మాత్రమే సీఏఏ కల్పిస్తుందని తెలిపారు.. రాజకీయ లబ్ధి పొందడం కోసం AIMIM ఎంపీ ఓవైసీ, కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా విపక్షాలన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు..