ఏపీ(AP)లో సర్పంచులు(Sarpanch) ఇవాళ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్(Ex MLC YVB Rajendra Prasad) నిన్ననే హౌస్ అరెస్టయ్యారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సర్పంచుల సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీని ముట్టడించి తమ హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కానీ కొంత మంది సర్పంచులు అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. కార్లలో అసెంబ్లీ వద్దకు చేరుకున్న సర్పంచులు పోలీసుల వలయాన్ని చేధించుకుని ఊహించని విధంగా అసెంబ్లీ వద్దకు సర్పంచులు వచ్చేశారు.
సర్పంచ్లు అసెంబ్లీ సమీపంలోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సర్పంచులు బారికేడ్లను తోసుకుని లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సర్పంచులు ప్రధానంగా 16డిమాండ్లను లేవనెత్తుతున్నారు.